Friday, 27 July 2018

ఎత్తైన భవనం పైనుంచి జలపాతం....ఫోటో ఫీచర్


ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణాలు చేపట్టడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది.


తాజాగా చైనాలో గియాంగ్‌ పట్టణంలో 108 మీటర్ల ఎత్తైన అద్దాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనం పైనుంచి జలపాతంలా నీళ్లు కిందకు పడేలా చేశారు.ఈ కృత్రిమ జలపాతం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే జలపాతం రన్‌ చేయాలంటే చాలా ఖర్చవుతుందట. అందుకే రోజూ 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే జలపాతం రన్‌ చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భాలు, కార్యక్రమాలు ఉన్నప్పుడు జలపాతం ఉండేలా చూస్తున్నారు. ఒక గంట పాటు జలపాతం రన్‌ చేస్తే సుమారు 8వేల రూపాయల ఖర్చవుతోంది. ఇక నీటి విషయానికొస్తే రీసైకిల్‌ చేసిన నీటినే వాడుతున్నారు. ప్రపంచంలో అతి పెద్ద కృత్రిమ జలపాతం ఇదే.


ఈ జాలువారే జలపాతాన్ని చూడటానికి జనం ఆసక్తి చూపుతున్నారట.

Tuesday, 24 July 2018

ప్రి ఇంప్లాంటేషన్‌ జెనిటిక్‌ డయగ్నోసిస్‌ (పిజిడి) కు రంగం సిద్ధం: ప్రభుత్వాలు అంగీకరించే అవకాశం.... ఆర్టికల్


శాస్త్రజ్ఞులు కలలుగంటున్న ప్రతిసృష్టి పి.జి.డి.....ఇది క్లోనింగ్ కాదు.

ఈ టెక్నాలజీని వాడుకుంటే రోగాలు, రొప్పులు లేని ఆరోగ్యవంతమైన లోకం తయారవుతుంది అంటున్నారు.

ఈ టెక్నాలజీతో తయారయ్యే పిండంలో తల్లిదండ్రులకు సంబంధించిన జన్యువులతోపాటు మూడోవ్యక్తి జన్యువులూ ఉంటాయి. పిజిడి డిజైన్‌లో కీలకపాత్ర పోషించేది ఇవే!... ఈ పిజిడి డిజైన్‌లో (ఇంతకుముందు డిజైనర్ బేబీస్ పేరుతో వచ్చిన టెక్నాలజీలో తల్లితండ్రులు తమకు కావలసినట్లు పిల్లలను డిజైన్ చేసుకోవచ్చు...దీనిని ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలూ అంగీకరించలేదు) విషయంలో ఆ పిండంలో జన్యువులు ఎలా ఉండాలో డాక్టర్లు మాత్రమే నిర్ణయిస్తారు.


ఇంతకు ఈ ‘పిజిడి డిజైన్‌' ఆలోచన సైంటిస్టులకు ఎందుకొచ్చింది?

అనేక మంది పిల్లలు జన్యు లోపాలతో పుడుతున్నారు. ఇలా పుట్టిన పిల్లలకు వైద్యం చెయ్యటం అసాధ్యమవుతోంది. ఒకవేళ వైద్యం ఉన్నా బతికినంత కాలం ఖరీదైన మందులు వాడుతూ బాధాకరమైన జీవితాన్ని గడపవలసి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో శాస్త్రవేత్తలు అసలు ఈ రోగాలకు కారణమైన జన్యువులను గుర్తించి తీసివేయటం...లేక కొత్త జన్యువులను సృష్టించి అటువంటివారిలో ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. ఈ ఆలోచనల ఫలితమే ‘పిజిడి డిజైన్‌’ కాన్సెప్ట్‌. జన్యులోపాలను సవరించడానికి అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఈ పిజిడి డిజైన్‌.

పిండం ఏర్పడక ముందే జన్యులోపాలను తొలగిస్తే, లోపాలతో పిల్లలు జన్మించే అవకాశం ఉండదు. అటువంటి లోపాలను గుర్తించగలిగిన టెక్నాలజీ పేరే ప్రి ఇంప్లాంటేషన్‌ జెనిటిక్‌ డయగ్నోసిస్‌ (పిజిడి). అండం ఫలదీకరణం చెందిన స్థితిలోనే ఈ పిజిడి పద్ధతిలో జన్యులోప నివారణ చెయ్యడానికి ఆస్కారం ఉంది. అంటే తల్లిదండ్రుల్లో ఉన్న లోపాలున్న జీన్స్‌ కనిపెట్టి నివారించడానికే ఈ టెక్నిక్‌ ఉపయోగపడుతుందని అర్థం. ఉన్న జన్యువులను మార్చి కొత్త జన్యువులను సృష్టించి పిల్లల్ని డిజైన్‌ చెయ్యటం పిజిడి పద్దతివల్ల కుదరదు.

కాబట్టి ఈ పి.జి.డి టెక్నాలజీని ప్రభుత్వాలు అనుమతించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

Saturday, 21 July 2018

కొత్త వంద రూపాయల నోటుపై ముద్రించబడ్డ వారసత్వ నిర్మాణం గురించి తెలుసుకుందాము....ఫోటో ఫీచర్


కొత్త వంద రూపాయల నోటును రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఊదా రంగు నోటుపై ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్‌లోని 'రాణి కి వావ్‌' నిర్మాణం ను కొత్త వంద రూపాయలనోటు వెనుక భాగంలో మోతీఫ్ గా ముద్రించారు. దీనిపై స్వచ్ఛభారత్‌ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు తదితర వివరాలు ఉంటాయి.


ఇక 'రాణి కి వావ్‌' గురించి తెలుసుకుందాం.ఈ నిర్మాణం గురించి చాలా మందికి తెలియదు. గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలోని సరస్వతి నది తీరంలో ఉన్నది ఈ 'రాణి కీ వావ్' నిర్మాణం. ఈ నిర్మాణం ఒక చారిత్రక, ఏడు భూగర్భ అంతస్తుల బావి. ఈ బావికి 2014 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల ( వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాజితాలో చోటు దక్కింది. 2016 లో భారతదేశంలోని వారసత్వ ప్రదేశాలలోనే పరిశుభ్ర వారసత్వ ప్రదేశంగా అవార్డు గెలుచుకుంది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో ఆనాటి సాంకేతిక అభివృద్ధికి 'రాణి కీ వావ్' అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని, భారత్‌లో ఆనాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని యునెస్కో కొనియాడింది.క్రీ.శ 1022 - 1063 మధ్యన రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు. సోలంకి రాజ్యాన్ని పాలించిన తన భర్త, రాజు ఒకటో భీందేవ్ గుర్తుగా ఈ బావిని నిర్మించారు. మామూలుగా ఎప్పుడూ రాజులే తమ భార్యల గుర్తుగా రాణీలకు నిర్మాణాలను కట్టించేవారు. కానీ 'రాణి కి వావ్' బావిని ఒక రాణి తన భర్త గుర్తుగా నిర్మాణించింది. ఇదే ఇక పెద్ద విషేషంగా చెబుతారు.


తొమ్మిది వందల ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు.


ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. 'రాణి కీ వావ్' బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు ఉన్నాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.