Saturday, 21 July 2018

కొత్త వంద రూపాయల నోటుపై ముద్రించబడ్డ వారసత్వ నిర్మాణం గురించి తెలుసుకుందాము....ఫోటో ఫీచర్


కొత్త వంద రూపాయల నోటును రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఊదా రంగు నోటుపై ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్‌లోని 'రాణి కి వావ్‌' నిర్మాణం ను కొత్త వంద రూపాయలనోటు వెనుక భాగంలో మోతీఫ్ గా ముద్రించారు. దీనిపై స్వచ్ఛభారత్‌ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు తదితర వివరాలు ఉంటాయి.


ఇక 'రాణి కి వావ్‌' గురించి తెలుసుకుందాం.



ఈ నిర్మాణం గురించి చాలా మందికి తెలియదు. గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలోని సరస్వతి నది తీరంలో ఉన్నది ఈ 'రాణి కీ వావ్' నిర్మాణం. ఈ నిర్మాణం ఒక చారిత్రక, ఏడు భూగర్భ అంతస్తుల బావి. ఈ బావికి 2014 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల ( వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాజితాలో చోటు దక్కింది. 2016 లో భారతదేశంలోని వారసత్వ ప్రదేశాలలోనే పరిశుభ్ర వారసత్వ ప్రదేశంగా అవార్డు గెలుచుకుంది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో ఆనాటి సాంకేతిక అభివృద్ధికి 'రాణి కీ వావ్' అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని, భారత్‌లో ఆనాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని యునెస్కో కొనియాడింది.



క్రీ.శ 1022 - 1063 మధ్యన రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు. సోలంకి రాజ్యాన్ని పాలించిన తన భర్త, రాజు ఒకటో భీందేవ్ గుర్తుగా ఈ బావిని నిర్మించారు. మామూలుగా ఎప్పుడూ రాజులే తమ భార్యల గుర్తుగా రాణీలకు నిర్మాణాలను కట్టించేవారు. కానీ 'రాణి కి వావ్' బావిని ఒక రాణి తన భర్త గుర్తుగా నిర్మాణించింది. ఇదే ఇక పెద్ద విషేషంగా చెబుతారు.


తొమ్మిది వందల ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు.


ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. 'రాణి కీ వావ్' బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు ఉన్నాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

No comments:

Post a Comment